నకిలీ మిరప నార కంపెనీపై చర్యలకు సిపిఎం డిమాండ్‌

0
58

రైతులకు నకిలీ మిరప నారను అంటగట్టిన ఓమ్ని యాక్టివ్‌ హెల్త్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ కంపెనీపై చర్యలు తీసుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. మండల పరిధిలోని కసాపురం, దోసలుడికి గ్రామాలలో మిరప పంటలు సాగుచేసిన పొలాలను సిపిఎం నాయకులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.శ్రీనివాసులు మాట్లాడుతూ.. అధిక దిగుబడులు ఇస్తాయని రైతులను నమ్మించి నకిలీ మిరప నారను అంటగట్టి రైతులను మోసం చేశారన్నారు. పంట సాగుచేసి మూడు నెలలైనా పంట అడుగు ఎత్తు కూడా పెరగ లేదన్నారు. ఎకరాకు రూ.లక్షకు పైగా ఖర్చు చేసి సాగుచేసిన పంట చేతికి రాకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు.మండల వ్యాప్తంగా దాదాపు 250 ఎకరాల్లో మిరప పంట సాగుచేశారన్నారు. అరకొరగా పండిన కాయలు కూడా పూర్తిగా నాసిరకంగా ఉన్నాయన్నారు. రైతులు పండించిన మిరప కాయలను సదరు కంపెనీ కొనుగోలు చేసి రైతుకు ఎకరాకు రూ.1.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నారు. రైతులను నమ్మించి మోసగించిన కంపెనీ దళారులు నాగరాజు, నీలకంఠ, బళ్లారి జగదీష్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాల సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి బి.శ్రీనివాసులు, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దాసరి శ్రీనివాసులు, నాయకులు సాకే నాగరాజు, తిమ్మప్ప, రమేష్‌, బాల, రాము నాయక్‌, రైతులు పాల్గొన్నారు.