పెట్రోలు ధరలు పెరుగుదలపై కేంద్రం పై మండిపడ్డ రాహుల్

0
14

న్యూఢిల్లీ : పెట్రోల్‌ ధరల పెంపు కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. దేశంలో పన్ను వసూళ్ల విపత్తు నిరంతరంగా కొనసాగుతుందని ఆరోపించారు. గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో పెట్రోల్‌ ధర రూ.100 దాటగా.. డీజిల్‌ రేటు సైతం రూ.100కు చేరువైంది. ఈ క్రమంలో ఆయన ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. చాలా రాష్ట్రాల్లో అన్‌లాక్‌ ప్రారంభమైందని, పెట్రోల్‌ పంపు వద్ద చెల్లించేటప్పుడు.. మోదీ ప్రభుత్వం పెంచిన ద్రవ్యోల్బణం వికాసాన్ని చూస్తారని ట్వీట్‌ చేశారు. మరో వైపు కాంగ్రెస్‌ నేత రణదీప్ సూర్జేవాలా పెట్రోల్‌ ధరల పెరుగుదలను అధికమైన ప్రజాదోపిడీగా అభివర్ణించారు. దీనికి కేంద్రమే బాధ్యత వహించాలన్నారు. ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ కేంద్ర సర్కారుపై విమర్శలు గుప్పించింది. పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేసింది.