Fixed deposit కు పెరుగుతున్న ఆదరణ●●●అమల్లోకి వచ్చిన తాజా వడ్డీ రేట్లు ఇవే

0
14

నష్టభయం లేని పెట్టుబడుల్లో ఫిక్స్​డ్​ డిపాజిట్లు మొదటి స్థానంలో ఉంటాయి. అందుకే, భారత్​లో ఫిక్స్‌డ్​ డిపాజిట్లకు మంచి ఆదరణ ఉంటుంది. డిపాజిట్లపై స్థిరమైన ఆదాయం, బ్యాంకులు కల్పించే రక్షణ కారణంగా ఎఫ్​డీలను ఎంచుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అందువల్లే, చాలా మంది తమ పెట్టుబడులను ఎఫ్​డీలతోనే ప్రారంభిస్తుంటారు. ప్రస్తుతం, వివిధ బ్యాంకులు ఒక సంవత్సరం నుంచి పదేళ్ల మెచ్యూరిటీ గల ఎఫ్​డీలను అందిస్తున్నాయి. వీటిపై 5.50 నుంచి 6.50 శాతం వరకు వడ్డీ అందిస్తున్నాయి. సాధారణంగా, రెపో రేటు, బేస్ రేట్ వంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మానిటరీ పాలసీల ద్వారా బ్యాంకుల ఈ ఎఫ్‌డి రేట్లను నిర్ణయిస్తాయి.

వివిధ బ్యాంకుల ఎఫ్‌డి వడ్డీ రేట్లు డిపాజిట్ మొత్తం, డిపాజిట్ వ్యవధి, డిపాజిటర్ రకాన్ని బట్టి మారుతుంటాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ), ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్​లు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఎఫ్​డీలను అందిస్తున్నాయి. తాజాగా సవరించి వడ్డీరేట్ల ప్రకారం, ఏ ఏ బ్యాంకు ఎంత వడ్డీని అమలు చేస్తున్నాయో పరిశీలిద్దాం.

ఐసిఐసిఐ బ్యాంక్
ఐసిఐసిఐ బ్యాంక్ 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మెచ్యూరిటీ గల ఎఫ్​డీలను అమలు చేస్తుంది. డిపాజిట్ ​కాలాన్ని బట్టి 2.5 శాతం నుండి 5.50 శాతం వరకు వడ్డీ అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు ఇతరుల కన్నా 50 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) అధిక వడ్డీ రేటును పొందుతారు. ఈ రేట్లు అక్టోబర్ 21 నుంచి వర్తిస్తాయి.

స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా
ఎస్‌బిఐ 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య ఎఫ్‌డిలను అమలు చేస్తుంది. డిపాజిట్​ కాలాన్ని బట్టి 2.9 శాతం నుంచి 5.4 శాతం వరకు వడ్డీ అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు ఇతరుల కన్నా 50 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) అధిక వడ్డీ రేటును పొందుతారు. ఈ తాజా వడ్డీరేట్లు 2021 జనవరి 8 నుంచి వర్తిస్తాయి.

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 7 రోజుల నుంచి 29 రోజుల మధ్య డిపాజిట్లపై 2.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఇక, 30 నుండి 90 రోజుల వరకు 3 శాతం, 91 రోజుల నుంచి 6 నెలల వరకు 3.5 శాతం, 6 నెలల నుంచి ఏడాది వరకు 4.4 శాతం వడ్డీ రేటు అందజేస్తుంది. ఏడాది వ్యవధి గల ఎఫ్‌డిలపై బ్యాంక్ 4.9 శాతం, ఏడాది నుంచి రెండేళ్ల వ్యవధి గల ఎఫ్​డీలపై 4.9 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. రెండేళ్ల నుంచి మూడేళ్ల ఎఫ్‌డిలపై 5.15 శాతం, మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు 5.30 శాతం, ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు ఉన్న డిపాజిట్లపై 5.50 శాతం వడ్డీ అమలు చేస్తుంది. కాగా, ఈ వడ్డీ రేట్లు 2021 మే 21 నుంచి వర్తిస్తాయి.

కోటక్ మహీంద్రా బ్యాంక్
కోటక్ మహీంద్రా బ్యాంక్ 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మెచ్యూరిటీ గల టర్మ్ డిపాజిట్లపై 2.5 శాతం నుంచి 5.30 శాతం వరకు వడ్డీ రేటును అందజేస్తుంది. ఈ వడ్డీ రేట్లు 2021 ఏప్రిల్ 26 నుంచి వర్తిస్తాయి.