కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి రాష్ట్ర రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఇవి రోజుకోవిధంగా మలుపుతిరుగుతున్నాయి.

0
14

చెన్నై: కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి రాష్ట్ర రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఇవి రోజుకోవిధంగా మలుపుతిరుగుతున్నాయి. ముఖ్యంగా ముగ్గురు నామినేటెడ్‌ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులతో సహా 12 మంది ఎమ్మెల్యేలతో పుదుచ్చేరిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు సభాపతి పదవినీ తమకే కేటాయించాలని కమలనాధులు ముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామి ముందు డిమాండ్‌ పెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే బీజేపీ నేతల డిమాండ్‌ను రంగస్వామి ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో కొత్త మంత్రివర్గ విస్తరణపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆ రాష్ట్ర లెఫ్టినెంట్‌ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌తో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులతో పాటు.. తమ పార్టీ సంఖ్యాబలం, మంత్రి వర్గ విస్తరణ తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల్లో ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌, బీజేపీ, అన్నాడీఎంకేలు కలిసి పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ 16 సీట్లలో పోటీ చేసి 10 చోట్ల విజయం సాధించింది. అలాగే, బీజేపీ 9 చోట్ల పోటీ చేసి ఆరు స్థానాల్లో గెలుపొందింది. ఐదు చోట్ల పోటీ చేసిన అన్నాడీఎంకే ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా గెలుపొందలేదు.

దీంతో ఎన్డీయే కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సాధారణ మెజార్టీ (16 సీట్లు) వచ్చాయి.అయితే, ఈ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థుల్లో ముగ్గురు బీజేపీ జైకొట్టారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం మరో ముగ్గురు బీజేపీ నేతలను శాసనసభకు ఎమ్మెల్యేలుగా నామినేట్‌ చేసింది. దీంతో బీజేపీ సంఖ్యాబలం 12కు చేరింది. అంటే ప్రజాక్షేత్రంలో 10 సీట్లు గెలుచుకున్న ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ కంటే ఎక్కువైంది. దీంతో బీజేపీ నేతలు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు.. సభాపతి స్థానాన్ని తమ పార్టీ సభ్యులకు కేటాయించాలని ముఖ్యమంత్రి రంగస్వామిపై తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది.

బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

ప్రస్తుతం సంఖ్యాపరంగా పుదుచ్చేరి శాసనసభలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలంతా కలిసి ఒక సమావేశం నిర్వహించారు. దీనికి కేంద్ర పరిశీలకుడుగా నిర్మల్‌కుమార్‌, రాష్ట్ర అధ్యక్షుడు స్వామినాథన్‌ హాజరయ్యారు. ఈ సమావేశం తర్వాత నిర్మల్‌ కుమార్‌ మాట్లాడుతూ, 12 మంది సభ్యులతో అతిపెద్ద పార్టీగా అవతరించామని తెలియజేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయలేదన్నారు. అదేసమయంలో తాము కోరిన మంత్రిత్వ శాఖల కేటాయించాల్సిందిగా సీఎంను కోరుతున్నట్టు చెప్పారు. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్నారు. అలాగే, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎన్డీయే కూటమి కొనసాగుతుందని నిర్మల్‌కుమార్‌ తెలిపారు.