Uncategorized

పదవుల కోసం ఉద్యోగులను పణంగా పెట్టవద్దు ఉద్యోగుల వేతన సవరణలోనూ జాప్యమా ?

ఉద్యోగుల వేతన సవరణలోనూ జాప్యమా ?

పదవుల కోసం ఉద్యోగులను పణంగా పెట్టవద్దు

రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారుతారా ?

ఉద్యోగుల సమస్యల కోసం పోరాటం చేస్తాం – ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలాజనాథ్

విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయడంలోనూ ప్రభుత్వం జాప్యం చేయడం తగదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలాజనాథ్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ధనవంతులు కాదని, కొందరు స్వార్ధంతో రాజకీయ పార్టీలకు మద్దతు పలుకుతూ తమ స్వార్ధం కోసం ఉద్యోగులను బలి చేస్తున్నారని శైలజనాథ్ ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఓ ఉద్యోగ సంఘం నేత సమస్యలు పరిష్కరించకుండా రాజ్యాంగ బద్ధమైన పదవి పొందారని, ఇప్ప్పుడు తాజాగా మరో ఉద్యోగ సంఘం నేత పదవి కోసం ఉద్యోగులను పణంగా పెట్టే ప్రయత్నం చేయడం శోచనీయమన్నారు. ఉద్యోగులంతా ఐకమత్యంతో ఇలాంటి ప్రయత్నాలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం విజయవాడ ఆంధ్రరత్న భవన్ నుంచి ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2018 మే 28న 11వ పీఆర్సీ కమిటీ ఏర్పాటై 2020 అక్టోబర్ 5న నివేదిక సమర్పించిందని, 2018 జులై 1 నుంచి అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని శైలజనాథ్ విమర్శించారు. పదకొండవ పిఆర్సి ని వెంటనే అమలు పరచాలని, ఉద్యోగుల చిరకాల కోరిక అయిన సిపిఎస్ విధానాన్ని రద్దు పరచాలని వారు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై అశుతోష్ మిశ్రా కమిషన్ నివేదిక సమర్పించి ఏడాది పూర్తయిందని, ఇంతవరకూ రాష్ట్ర ప్రభుత్వం ఆ నివేదికను అమలు చేయలేదని, నివేదిక ప్రభుత్వానికి అందాక అమలుకు ఇంత జాప్యం ఎప్పుడూ లేదని ఉద్యోగసంఘాల నేతలు చెబుతున్నారన్నారు. ఈ నివేదిక అందిన తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, అందులో ఆర్థికశాఖ, సాధారణ పరిపాలనశాఖ ఉన్నతాధికారులు ఉన్నారన్నారు. పీఆర్సీపై ప్రాథమిక చర్చలే పూర్తయ్యాయని, మంత్రివర్గానికి సిఫార్సులు చేసే అంశం కొత్త సీఎస్ చూస్తారని, ఉద్యోగులకు 2019 జులై నుంచి 27% మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తున్నారన్నారు. పదకొండో వేతన సవరణ సంఘం 2018 మే 28న ఏర్పాటయిందని, ఆరుసార్లు గడువు పెంచాక చివరకు గతేడాది అక్టోబరు 5న కమిషన్ నివేదికను సమర్పించిందని, ఆంధ్రప్రదేశ్లో వేతన సవరణ సంఘాల ఏర్పాటు 1969లో ప్రారంభమయిందని, ఇంతవరకు 11 పీఆర్సీలను ఏర్పాటు చేశారన్నారు. వీటి సిఫార్సులను ఆలస్యంగా అమలు చేయడంతో నష్టపోతున్నామని ఉద్యోగులు వాపోతున్నారని, అమలుతేదీ, ఆర్థికలాభాల ప్రారంభానికి మధ్య కాలాన్ని నోషనల్ (వాస్తవ అమలు కాకుండా కాగితాల్లో) అని నిర్ణయిస్తున్నారని, ఈసారి అది మరీ ఆలస్యమవుతోందని, దీంతో ఈ మధ్య కాలంలో పదవీవిరమణ చేసే ఉద్యోగులు నష్టపోతున్నారని శైలజానాథ్ తెలిపారు. 11వ పీఆర్ సీ అమలు చేయుట, సీపీఎస్ రద్దు పరచుట, కాట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాల పెంపుదల లాంటి ప్రధాన సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని శైలజనాధ్ సూచించారు. ఉద్యోగుల సమస్యల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని శైలజనాథ్ స్పష్టం చేశారు.

Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.
×
Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here